అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి ప్రేక్షకుల్ని ఎంత రంజింపజేసాయో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో హాథీరామ్ బాబా ఇతివృత్తంతో రూపొందిన మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రయూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా...
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ``సినిమా రిలీజై సక్సెస్ అయిన తర్వాత అందరూ థాంక్స్ చెబుతారు కానీ నేను ముందుగానే థాంక్స్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను సినిమా చూశాను. చాలా బావుంది. సాధారణంగా భక్తులు తిరుమలకు ఎందుకు వెళతారు..స్వామికి కానుకలు ఎందుకు వేస్తారో అనే చాలా విషయాలను అన్నమయ్య సినిమా టైంలో తెలుసుకున్నాను. అలాగే ఓం నమో వేంకటేశాయ సినిమా చేసేటప్పుడు ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను. కమర్షియల్ సినిమాలు ఎన్నైనా, ఎప్పుడైనా చేయవచ్చు. కానీ ఇలాంటి సినిమాలు చేసే అవకాశం ఎప్పటికో కానీ రాదు. ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఓం నమో వేంకటేశాయ ఒక ఆధ్యాత్మికమైన, అందమైన సినిమా. ఇలాంటి సినిమాలో నటించడం వల్ల ఒక క్రమశిక్షణ వస్తుంది. రాఘవేంద్రరావుగారి దర్శకత్వం, కీరవాణిగారి సంగీతం, సాహిత్యం, ఇలా అందరూ సహాకారంతో సినిమా చేశాను. ఈ సినిమాలో చేసేటప్పుడు ఈ సినిమా ఎందుకు చేయాలనే విషయం కళ్ళకు కట్టినట్టు తెలిసింది. ప్రేక్షకుల మదిలో ఒక మేజిక్‌ను క్రియేట్ చేసే సినిమా ఇది. దేవుడిని చూడాలనుకునే వ్యక్తి జర్నీ ఇది. అటువంటి వ్యక్తి ఏడు కొండలవాడిని చూడగానే ఎలా మారాడనేదే సినిమా. రాఘవేంద్రరావుగారు అద్భుతంగా తెరకెక్కించారు. నా లైఫ్‌లో ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎంత కలెక్ట్ చేస్తుందనే భావన లేకుండా హ్యాపీగా ఉన్న సినిమా ఇది. నా కెరీర్ బెస్ట్ మూవీ`` అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ``ఓం నమో వేంకటేశాయ ఫిబ్రవరి 10న రిలీజవుతుంది. ఆరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అమెరికా సహా ఓం నమో వేంకటేశాయ సినిమా ఆడే థియేటర్స్ అన్నీ తిరుమల పుణ్య క్షేత్రాలుగా మారుతాయి. నాగార్జున అద్భుతతమైన అభినయాన్ని కనపరిచాడు. ఈ సినిమాను ఓ స్పిరుచ్యువల్ జర్నీగా భావిస్తున్నాను`` అన్నారు.
నిర్మాత ఎ.మహేష్ రెడ్డి మాట్లాడుతూ - ``అందరూ ఓ ఫ్యామిలీలా కలిసిపోయి చేసిన సినిమా ఇది. ఇలాంటి ఒక మూవీ చేయడంతో నా జన్మ ధన్యమైంది. ఆ శ్రీనివాసుడే మమ్మల్ని నడిపించాడని అనుకుంటున్నాను. ఆయన కటాక్షంతోనే ఈ ఏజ్‌లో కూడా రాఘవేంద్రరావుగారు రోజుకు పదమూడు గంటలపాటు పనిచేసి మేం అనుకున్నసమయానికి సినిమాను విడుదల చేయగలిగాం. నాగార్జునగారు కథ విని ఒప్పుకున్న రోజు నుండి గడ్డం కూడా తీయకుండా సినిమాను పూర్తి చేశారు. సినిమాను చూశాను. అద్భుతంగా ఉంది. దేవుడు-భక్తుడు కలిసి ఆడే ఆట ఇది. చూసే ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి భక్కులకు, అక్కినేని నాగార్జున అభిమానులకు అద్భుతమైన గిఫ్ట్‌లాంటి సినిమా`` అన్నారు.
సౌరభ్ జైన్ మాట్లాడుతూ - ``భాష తెలియకపోయినా ఈ సినిమాలో నేను చేయడానికి కారణం రాఘవేంద్రరావుగారు. ఆయన కథ చెప్పగానే నా డైరెక్షన్‌లో చేయడం పిక్నిక్‌లా ఉంటుందని అన్నారు. ఆయన అన్నట్టుగానే ఇదొక పిక్నిక్‌లా గడిచింది. నాగార్జునగారు, రాఘవేంద్రరావు, కీరవాణి, గోపాల్‌రెడ్డి సహా చాలా మంది లెజెండ్స్‌తో పనిచేసే అదృష్టం దొరికింది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో విమలారామన్, ఆస్మిత, జె.కె.భారవి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, విక్రమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.