నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ సినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా విజయాన్ని కోరుతూ నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘానికి చెందిన ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యండ్స్ జగన్, సహా ఇతర సభ్యులు భారతదేశంలోని శత పుణ్య క్షేత్రాలను దర్శించారు. ఆ పుణ్యక్షేత్రాల కుంకుమను శనవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన శత చిత్ర యోధ శతమానం భవతి కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణకు అందించారు. అభిమానులు నందమూరి బాలకృష్ణ సత్కరించారు. ఈ సందర్భంగా....
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ``రాజహంస ఎంతో గొప్ప పక్షి అటువంటి తెలుగుజాతి రాజహంస `గౌతమిపుత్ర శాతకర్ణి`. తెలుగుజాతికి ఎంతో గొప్ప పేరును తెచ్చిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ సినిమా ప్రారంభం చేయడానికి ముందు మాకు కూడా శాతకర్ణి గురించి తక్కువగానే తెలుసు. అయితే పరబ్రహ్మ శాస్త్రి, కృష్ణశాస్త్రిలు జరిపిన విశేష కృషి కారణంగా గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఏంటో మాకు తెలిసింది. ఈ సినిమా విడుదల సందర్భంగా పరబ్రహ్మశాస్త్రి, కృష్ణశాస్త్రిలకు నా ధన్యవాదాలు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో సంక్రాంతి నుండే ఉగాది సంబరాలు మొదలవుతాయి. ఇటువంటి సినిమాను నిర్మించిన నిర్మాతలు బిబో శ్రీనివాస్, రాజీవ్ రెడ్డి, సాయిబాబులను అభినందిస్తున్నాను. వీరికి తెలుగుజాతి ఎంతో రుణపడి ఉంది. ఈ సినిమా ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. క్రిష్, సాయిమాధవ్ బుర్రాగారు ప్రతి సన్నివేశం అద్భుతంగా రావడానికి బాగా కృషి చేశారు. అలాగే తెలుగు జాతి గొప్పతనాన్ని తెలియజేసే సినిమా కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా ధన్యవాదాలు. అలాగే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాగా రావడానికి అందరూ ఎంతగానో కృషి చేశారు. సినిమా ఎంపికలో నేను కాస్తా లోపాలు చేసుండవచ్చు కానీ ఇకపై సినిమాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాను. సాధారణంగా నాకు చిన్నప్పట్నుంచి సినిమాలంటే చాలా ఆసక్తి. అయితే నాన్నగారు ముందు చదువు ముఖ్యమని చెప్పడంతో చదువుపై దృష్టి సారించాను. లేకుంటే ఇప్పటికే 250 సినిమాలు చేసేవాడిని. ఎన్ని సినిమాలు చేశామనడం కన్నా, కళామతల్లికి ఎంత సేవ చేశామనేదే ముఖ్యం. నేను ఇన్ని విభిన్నమైన పాత్రలు చేయడానికి కారణం నా అభిమానులే. తొమ్మిది రాష్ట్రాలు, 1600కిలోమీటర్లు, 41 రోజుల పాటు శతపుణ్య క్షేత్రాలతో పాటు దేశంలో మతాలకు అతీతంగా చర్చిలు, మసీదుల్లో కూడా సినిమాతో పాటు అందరూ బావుండాలని నా అభిమానులు పూజలు చేశారు. వారందరికీ నా అభినందనలు`` అన్నారు.
బిబో శ్రీనివాస్ మాట్లాడుతూ - ``సినిమా ప్రారంభం నుండి ఇప్పటి వరకు సినిమాను మోస్తూ వస్తుంది నందమూరి అభిమానులే. ఆరోజుల్లో శాతకర్ణి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఇకపై శాతకర్ణి అంటే నందమూరి బాలకృష్ణగారే అందరికీ గుర్తుకు వస్తారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాపై అంతటా పాజిటివ్ బజ్ ఉంది`` అన్నారు.
ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ మాట్లాడుతూ - ``నందమూరి బాలకృష్ణగారు మా అభిమానులను ముందుండి నడిపిస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు్న్నారు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అనే భారతదేశం గర్వించదగ్గ సినిమా చేశారు`` అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత వై.రాజీవ్ రెడ్డి సహా నందమూరి బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.